50 వేల ఉద్యోగాల‌కు కార్యాచ‌ర‌ణ ప్రారంభం

world youth skills day శుభాకాంక్ష‌లు తెలిపిన సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ యువతకు ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం ( world youth skills day) శుభాకాంక్ష‌లు తెలిపారు. స్వ‌రాష్ట్ర ఫ‌లాల‌ను వ‌ర్త‌మాన‌, భ‌విష్య‌త్ త‌రాల‌కు పూర్తి స్థాయిలో అందించేలా తెలంగాణను రాష్ర్ట ప్ర‌భుత్వం తీర్చిదిద్దుతోంద‌ని సిఎం వెల్ల‌డించారు.

సకల జన జీవనం గుణాత్మకంగా అభివృద్ధి చెందిననాడే నిజమైన అభివృద్ధి అని ప్రభుత్వం విశ్వసించిందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రాధాన్యతక్రమంలో అభివృద్ధి కార్యాచరణ చేపట్టిందన్నారు. తెలంగాణ గ్రామీణ, పట్టణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేండ్లుగా అమలు పరుస్తున్న ప్రభుత్వ కార్యాచరణ కొలిక్కి వచ్చిందన్నారు.

సాగునీరు, తాగునీరు, విద్యుత్తు రంగాలను గాడిలో పెట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధిపరిచి, రైతు సహా సబ్బండ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలుపరుస్తూ వస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ సత్పలితాలిస్తుంద‌ని అన్నారు.

పరిశ్రమలు ఐటి రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని సీఎం అన్నారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1 లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలిచ్చిందని, నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో 50 వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ ప్రారంభమైందని సీఎం చెప్పారు. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామ‌ని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైందని, వారికి నైపుణ్యాలు తోడైతే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుందని సీఎం పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా పకడ్బందీ ప్రణాళికలను రాష్ట్ర స‌ర్కార్ రచించి అమలు చేస్తున్నదని ముఖ్య‌మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.