Oxygen లేక చనిపోవడం దేశానికే అవమానం
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఈటల ఫైర్

హైదరాబాద్(CLiC2NEWS): కరోనా సమయంలో ఆక్సిజన్ లేక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని తెలంగాణ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అవసరమైన ఆక్సిజన్‌ను కేంద్రం యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలని ఆయన కోరారు. తెలంగాణకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని కోరాం. కానీ రాష్ర్టానికి 306 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే కేటాయించింది. రాష్ర్టానికి దగ్గర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ఇవ్వాలని కోరినప్పటికీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ర్టాల నుంచి ఆక్సిజన్ ను కేటాయించారు. అలాగే కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని మంత్రి ఈటల డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి యుద్ధ ప్రతిపాదికన పెరగాలి. వ్యాక్సిన్ లేకపోతే గందరగోళమవుతుందని అధికారులు చెప్తున్నారు. రాష్ర్టంలో 18-44 ఏండ్ల మధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలి. రెండు కంపెనీల ఉత్పత్తి 6 కోట్లే అంటున్నారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలి అని ఈటల డిమాండ్ చేశారు.
అన్నీ కేంద్రం చేతుల్లో.. రాష్ట్రాలపై ఆరోపణలా..?
బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాలపై ఆరోపణలు చేయడం సరికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణలో 4 రాష్ర్టాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మేం కేంద్రాన్ని విమర్శించట్లేదు.. వారే విమర్శిస్తున్నారు. కరోనా కట్టడిలో దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తున్న రాష్ర్టం తెలంగాణ.. అని రాజేందర్ స్పష్టం చేశారు.