సిఎం కాన్వాయ్‌కు ప్ర‌యాణికుల కారు.. సిఎం జ‌గ‌న్ సీరియ‌స్‌

ఇద్దరిపై స‌స్పెన్ష‌న్‌ వేటు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఒంగోలులో సిఎం కాన్వాయ్ కోసం తిరుమ‌ల వెళ్తున్న భ‌క్తుల కారును ఆర్డిఎ సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఘ‌ట‌న‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ ఘ‌ట‌న‌పై ప‌లు విమ‌ర్శ‌లు రావ‌డంతో సిఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆర్డిఎ అధికారుల‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెడితే స‌హించ‌బోమంటూ గ‌ట్టి సంకేతాలు ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

వివ‌రాలు-

ప‌ల్నాడు జిల్లా వినుకొండ‌కు చెందిన వేముల శ్రీ‌నివాస్ కుటుంబం శ్రీ‌వారి ద‌ర్శ‌నార్దం తిరుమ‌ల‌కు వెళ్తున్నారు. బుధ‌వారం రాత్రి ప‌ది గంట‌లు దాటిన త‌ర్వాత ఒంగోలులో వాహ‌నం ఆపి టిఫిన్ చేస్తుండ‌గా అక్క‌డికి ఒక హోంగార్డు వ‌చ్చి ఈనెల 22వ తేదీన సిఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఒంగోలు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో.. కాన్వాయ్ కోసం వాహ‌నంతో పాటు డ్రైవ‌ర్‌ను ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. తాము కుటుంబంతో తిరుమ‌ల‌కు వెళ్తున్నామ‌ని చెప్పినా వినిపించుకోకుండా పై అధికారుల ఆదేశాలు సార్‌, మీకు సారీ చెప్ప‌డం త‌ప్ప మేము ఏమీ చేయ‌లేమ‌ని కారుతో పాటు డ్రైవ‌ర్‌ను తీసుకొని వెళ్లిపోయాడు.
శ్రీ‌నివాస్ కుటుంబం ఆర్ధ‌రాత్రి వేళ న‌డిరోడ్డుపై ఉండాల్సి వ‌చ్చింది. త‌ర్వాత రాత్రి ఒంటి గంట ప్రాంతంలో వినుకొండ నుండి మ‌రో వాహ‌నాన్ని తెప్పించుకొని వాళ్లు తిరుమ‌ల‌కు వెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డం.. సిఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి.. బాధ్య‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.