ఒడిశాలో పతీ సహగమనం: భార్య చితిలోకి దూకిన భర్త..

భువనేశ్వర్ (CLiC2NEWS): ఒకప్పడు భారత దేశంలో సతీసహగమనాలు జరిగేవి అని చెప్పుకున్నాం… తాజాగా ఒడిశాలో పతీసహగమనం జరిగింది. భార్య మృతిని తట్టుకోలేని ఓ భర్త ఆమె చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె చితిలోకి దూకి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సియాల్జోడి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సియాల్జోడి గ్రామంలో రాయబారి (60), నీలమణి శబర (65) భార్యాభర్తలు. రాయబారి గుండెపోటుతో మంగళవారం మరణించింది. దాంతో నలుగురు కుమారులు, భర్త, గ్రామస్థులతో కలిసి గ్రామ శివర్లలోని శ్మశానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ చితికి నిప్పటించి అందరూ ఇళ్లకు బయలుదేరారు. అందరితోపాటే ఇంటికి బయలుదేరిన నీలమణి కొద్దిదూరం వచ్చి వెనక్కి తిరిగి పరుగున వెళ్లి చితిమంటల్లో దూకేశాడు. అందరూ చూస్తుండగానే ఒకే చితిలో భార్యాభర్తలు కాలిపోయారు. ఈ ఘటన గురించి పోలీసులకు తెలియడంతో అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామస్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం భార్య చనిపోయిందన్న బాధను తట్టుకోలేక బలన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.