అధికారులు ఇచ్చే పొడిపొడి సమాధానాలపై పవన్ ఆగ్రహం
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో మంత్రులను మాయ చేసేలా కొందరు అధికారులు సమాచారం అందజేస్తున్నారని అసెంబ్లీ లాబీల్లో తీవ్ర చర్చలు జరిగింది. అధికారులు అందజేసే సమాచారంపై ఎపి డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సిఎం, మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి సంభాషణల్లో పలు విషయాలు చర్చకు వచ్చాయి.
సమావేశాల్లో గత వైసీపీ సర్కార్కు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరయిన సమాధానాలు ఇవ్వడం లేదంటూ అధికారులపై డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసన సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇవాళ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదు . గ్రామ పంచాయతి నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై డిప్యూటీ సిఎం పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అధికారులు అందజేసే సమాధానంలో పూర్తి వివరాలు స్పష్టంగా లేకుండా.. `అవును.. కాదు.. ఉత్పన్నం కాదు` అనే రీతిలో ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసన సభలో పొడిపొడిగా చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. సమాధానంలోనే పూర్తి వివరాలు ఉండేలా చూడాలని డిప్యూటీ సిఎం ఆదేశించారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో అధికారుల సమాధానంపై మంత్రి డోలా బాలా వీరాంజనేయస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు.