తాడిపత్రిలో దారుణం.. నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
తాడిపత్రి (CLiC2NEWS): ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారికి తీవ్రగాయాలవడంతో స్థానికులు తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం, సజ్జల దిన్నెలో చోటుచేసుకుంది. గాయపడిన భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. వారితో పాటు పక్కనే నిద్రిస్తున్న బాలికకు కూడా మంటలు అంటుకున్నాయి. బాలిక స్వల్పంగా గాయపడింది.
వేముల పల్లెకు చెందిన నల్లపురెడ్డి, కృష్ణ వేణమ్మ భార్యాభర్తలు.. కొంతకాలంగా సజ్జల దిన్నె వద్ద ఉన్న పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారితోపాటు వారి సమీప బంధువు రమేశ్ రెడ్డి కూడా అక్కడే పనిచేస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయంపై రమేశ్‌ను నల్లపురెడ్డి మందలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వారిపై ద్వేషం పెంచుకున్న రమేశ్ అర్ధరాత్రి నిద్రిస్తున్న నల్లపు రెడ్డి, కృష్ణవేణమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దంపతులతో పాటు అక్కడే నిద్రిస్తున్న బాలికకు కూడా మంటలు అంటుకుని గాయపడింది.