పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
హైదరాబాద్ (CLiC2NEWS): సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలంటూ రాష్ట్ర సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ శనివారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ పూర్తయ్యే వరకూ విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తూ జారీ చేసిన మెమో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిల్లో కోరారు. ఈ పిటిషన్‌ను హైదరాబాద్‌కు చెందిన ప్రయివేటు ఉపాధ్యాయుడు ఎం.బాలకృష్ణ దాఖలు చేశారు. ఈ పిల్‌పై ఈనెల 31న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
విద్యా శాఖ నిర్ణయం చిన్న పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ఉందని పిల్లో పేర్కొన్నారు. మరోవైపు మూడో దశ కరోనా పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న నివేదికలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. భౌతిక దూరం, పిల్లల హాజరు, ఆన్లైన్ తరగతుల నిలిపివేత తదితరాలపై విద్యా శాఖ ఉత్తర్వుల్లో స్పష్టతనివ్వలేదన్నారు. వైద్యారోగ్య సలహా కమిటీ నివేదికను కూడా బయట పెట్టలేదన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపడంపై తల్లిదండ్రుల అంగీకార పత్రం తదితరాలపై స్పష్టత లేదన్నారు.
అలాగే పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసులను తెప్పించి పరిశీలించాలని కోరారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొవిడ్ మూడో దశ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్ కూడా కాలేదన్నారు.
అలాగే ముందుగా ఉన్నత పాఠశాలలు ప్రారంభించి పరిశీలించిన తర్వాత ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు మొదలు పెడితే బాగుండేదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. పిల్లలకు కరోనా సోకితే వెంటనే గుర్తించడం కష్టమని.. ఈ లోగా తరగతి గది అంతటితో పాటు… వారి ఇళ్లల్లోని వృద్ధులకూ ముప్పు ఉంటుందన్నారు. కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు.
ఇందులో ప్రతివాదులుగా విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య సంచాలకురాలు, ప్రజారోగ్య సంచాలకుడు, కొవిడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల సలహా కమిటీని ప్రతివాదులను చేశారు.