భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల యాత్రను వాయిదా వేసుకోండి: టిటిడి విజ్ఞప్తి
తిరుమల (CLiC2NEWS): ఈ నెల 11 నుంచి 15 వరకు వరుస సెలవుల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది. అధిక రద్దీ దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచిస్తున్నారు. అలాగే భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమలకు రావాలని కోరుతోంది. వారాంతం రద్దీతో పాటు వరుస సెలవులు ఈ నెల 19 వరకు ఉన్నాయి పైగా తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో తిరుమలకు యాత్రీకుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులు వికాలంగులు తిరుమలకు పెరటాసి మాసం అనంతరం రావాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. అలాగే శ్రీవారి దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో, క్యూలైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి సంసిద్ధత, ఓపికతో రావాలని టిటిడి ఒక ప్రకటనలో పేర్కొంది.