రంజాన్ మాసంలో సీవరేజి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు
జలమండలి అధికారులతో ఎండీ దానకిశోర్ సమీక్ష
హైదరాబాద్ (CLiC2NEWS): రంజాన్ మాసం మొదలుకానున్న నేపథ్యంలో మంచినీటి, సీవరేజి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం త్వరలో ప్రారంభం కానున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా సీవరేజి సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది కాకుండా మసీదుల సమీపంలో తరచూ సీవరేజి ఓవర్‌ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్‌హోళ్లను ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఇందుకు గానూ సరిపడా సిబ్బంది, యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనులు చేపడుతున్న సమయంలో కార్మికుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రానున్న 10 రోజుల పాటు పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా రంజాన్ మాసంలో సీవరేజి ఓవర్‌ఫ్లో వంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన సూచించారు. మసీదుల రహదారులపై అవసరమైన చోట్ల మ్యాన్‌హోళ్ల మరమ్ముత్తులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన లోతైన మ్యాన్‌హోళ్లను, మురుగునీరు నిలిచే ప్రాంతాలపై మరింత దృష్టి సారించాలని సూచించారు.
రంజాన్ మాసంలో తాగునీటి సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సరిపడా నీటిని, సరిపోయేంత ప్రెషర్‌తో సరఫరా చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులకు సూచించారు. మసీదులకు మంచినీటి వసతి కల్పించాలని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.