ఆరు నూరైనా ముందస్తుకు పోయే ప్రసక్తే లేదు: సిఎం కెసిఆర్
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మాత్రం రాజ్యాంగ రక్షణ లేదు.
హైదరాబాద్ (CLiC2NEWS): ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. సమావేశానికి టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, రైతుబందు సమితి జిల్లా అధ్యక్షలు హాజరయ్యారు. యాసంగి ధాన్యం కోనుగోళ్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో పండబోయే యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలో కేంద్రం సేకరించాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సిఎం తెలిపారు. ముందుగా మంత్రుల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నట్లు చెప్పారు. తెలంగాణ రైతుల పక్షాన వారు కేంద్ర మంత్రిని కలసి రైతుల సమస్యలను వివరిస్తారని వెల్లడించారు.
ఆహార ధాన్య సేకరణ విషయంలో దేశమంతా ఒకేదేశం – ఒకే సేకరణ విధానం ఉండాలి అని సిఎం అన్నారు. యాసంగిలో వచ్చే వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని, కనీస మద్ధతు ధర బియ్యానికి కాదు, ధాన్యానికి ఇవ్వాలని అన్నారు. దేశంలో ఇప్పటివరకు అందరికీ రాజ్యాంగ పరమైన రక్షణ ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మాత్రం రాజ్యాంగ రక్షణ లేదు. రైతులను కాపాడాలన్నా, వారి గౌరవం పెరగాలన్నా.. వారు స్వయం సమృద్ధి సాధించాలన్నా.. వారికి రాజ్యాంగ రక్షణ కల్పించాలని సిఎం అన్నారు.
ఆరునూరైనా ముందస్తుకు పోయే ప్రసక్తే లేదు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నా. నా ఆహ్వానం మేరకు ప్రశాంత్ కిశోర్ వచ్చి పని చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ డబ్బులు తీసుకొని పని చేయరు అని అన్నారు. దేశ రాజకీయాలపై ప్రశాంత్ కిశోర్‌కు అవగాహన ఉంది, ఆయన అవసరాల మేరకు 12 రాష్ట్రాలలో పనిచేశారని కెసిఆర్ పేర్కొన్నారు.