కెసిఆర్ కుమార్తె బాగుండాలనుకుంటే బిఆర్ ఎస్‌కు ఓటు వేయండి..: ప్రధాని మోడీ

భోపాల్ (CLiC2NEWS): కెసిఆర్ కుమార్తె బాగుండాలనుకుంటే బిఆర్ ఎస్‌కు ఓటువేయాలని.. ప్రజలు బాగుండాలంటే బిజెపికి ఓటువేయాలని ప్రధాని మోడీ అన్నారు. భోపాల్‌లో నిర్వహించిన మేరా బూత్.. సబ్‌సే మజ్‌బూత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పార్టీ కార్యకర్లను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అంతేకాకుండా విపక్షాల భేటీపై ఆయన ధ్వజమెత్తారు. 2024లో భారతీయ జనతా పార్టీ గెలవనన్న నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయని.. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయన్నారు. నేను మాత్రం అవినీతి పరులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని హామీ ఇస్తున్నా..అన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలకు బిజెపి దూరమని మోడీ అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిపై కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. వేర్వేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలని ప్రశ్నించారు. ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనలు పనిచేయవని.. రాజ్యాంగం కూడా సమాన హక్కుల గురించి చెబుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ వ్యవహారంపై ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని విమర్శించారు.