జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం..

ఢిల్లీ (CLiC2NEWS): మన సైనికుల పరాక్రమం, సాహసాలకు సెల్యూట్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఆయన తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంతగా మన సైన్యం ఎదుర్కుందని.. వారి ధైర్య సాహసాలు దేశానికి తలమానికం అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించారు.
గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్థాన్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను ఒక్క దెబ్బతో భారత్ తుడిచిపెట్టిందన్నారు. భారత్ దెబ్బకు పాక్ నిరాశనిస్పృహల్లో కూరుకుపోయిందని.. అచేతనావస్థకు చేరుకుందన్నారు. ఏంచేయాలో అర్ధంకాక .. భారత్‌లోని పాఠశాలలు, జనావాసాలుపై దాడికి దిగగా మన సైన్యం తిప్పికొట్లిందన్నారు. పాక్ మిసైళ్లు, రక్షణ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందన్నారు. పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లో భారత్ మిసైళ్లు విధ్యంసం సృష్టించాయని.. పాక్ యుద్ద విమానాలు గాలిలోకి తిరగలేని స్థితిని భారత్ కల్పించిందన్నారు. ఎలాంటి దుస్సాహసానికి పాక్ తెగబడినా భారత్ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా భారత్ తుదముట్టించి తీరుతుందన్నారు.