TS: అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా ప్రాజెక్టులు

ఒకేసారి జ‌ల‌మండ‌లికి రూ.5 వేల కోట్లు కేటాయించ‌డం గొప్ప విష‌యం

కొత్త ఎస్టీపీల‌తో 100 శాతం మురుగు జ‌లాల శుద్ధి

ఓఆర్ఆర్ గ్రామాల‌కు ఇక స‌మృద్ధిగా తాగునీరు

న‌గ‌రంలో తాగునీటి స‌మ‌స్య‌లు లేకుండా చేసిన ప్ర‌భుత్వం

జ‌ల‌మండ‌లి స‌మ‌ర్థంగా ప‌ని చేస్తోంది

మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ప్ర‌స్తుత అవ‌స‌రాల‌తో పాటు భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా న‌గ‌రాభివృద్ధికి, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ ప‌రిధిలోని ప్రాంతాల‌కు తాగునీటిని అందించ‌డానికి, కొత్త ఎస్టీపీల నిర్మాణానికి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింద‌న్నారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఈ రెండు ప్రాజెక్టుల‌కు నిధులు కేటాయించిన నేప‌థ్యంలో శ‌నివారం ఖైత‌రాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్‌తో క‌లిసి శ‌నివారం హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందుచూపు, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌కంలో హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రం చేయ‌డానికి అన్ని రంగాల‌కు చేయూత‌నిస్తూ, ముఖ్యంగా తాగునీరు, మురుగునీటి శుద్ధి కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించ‌డం గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ మాట్లాడుతూ…
హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌నాభా వేగంగా పెరుగుతోంద‌ని, న‌గ‌రం వేగంగా విస్త‌రిస్తోంద‌న్నారు. తాగునీటి స‌ర‌ఫ‌రాకు, ఎస్‌టీపీల నిర్మాణానికి ఒకేసారి రూ.5 వేల కోట్లు ప్ర‌భుత్వం కేటాయించ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌న్నారు. గ‌తంలో ఎప్పుడూ, ఏ ప్ర‌భుత్వ‌మూ ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేద‌న్నారు. ఎంతో ముందుచూపుతో ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ…
ప్ర‌స్తుతం అన్ని న‌గ‌రాలు మురుగునీటి స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాయ‌ని, ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారంగా మ‌న న‌గ‌రంలో ఉన్న 25 ఎస్‌టీపీల‌కు అద‌నంగా 31 ఎస్‌టీపీల‌ను నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు. రెండేళ్ల‌లో యుద్ధ‌ప్రాతిక‌న ఎస్టీపీల నిర్మాణాన్ని పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌దేళ్ల ముందుచూపుతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జ‌రుగుతోంద‌ని, కొత్త ఎస్టీపీల నిర్మాణం పూర్తైతే దేశంలోనే మురుగునీటి శుద్ధిలో మ‌న న‌గ‌రం నెంబ‌ర్ వ‌న్ అవుతుంద‌న్నారు. శివార్ల‌లో గ‌తంలో రెండు వారాల‌కు ఒకసారి మంచినీటి స‌ర‌ఫ‌రా అయ్యేద‌ని, తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత రోజు విడిచి రోజు స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌న్నారు. ఓఆర్ఆర్ ప‌రిధిలోని ప్ర‌జ‌లంద‌రికీ తాగునీరు స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్ర‌భుత్వం కొత్త ప్రాజెక్టు చేప‌ట్ట‌డం హ‌ర్ష‌నీయ‌మ‌న్నారు. గ‌త ఏడేళ్లుగా న‌గ‌రంలో మంచినీటి స‌మ‌స్య లేకుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుందని, గోదావ‌రి నీటిని న‌గ‌రానికి తీసుకొచ్చింద‌ని పేర్కొన్నారు. ఇప్పుడు సుంకిశాల ప్రాజెక్టు ద్వారా ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ న‌గ‌రంలో నీటి స‌మ‌స్య లేకుండా ఉండేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు.

ఎండీ దాన‌కిశోర్ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలో తాగునీటి స‌ర‌ఫ‌రా, సీవ‌రేజి నిర్వ‌హ‌ణ‌లో జ‌ల‌మండ‌లి స‌మ‌ర్థంగా ప‌ని చేస్తోంద‌ని త‌ల‌సాని పేర్కొన్నారు. సాంకేతిక‌త‌ను వినియోగించుకోవ‌డంలో జ‌ల‌మండ‌లి ముందుంటోంద‌న్నారు. భ‌విష్య‌త్ త‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని ముందుచూపుతో న‌గ‌రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు న‌గ‌ర ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల త‌ర‌పున ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్ మాట్లాడుతూ…
న‌గ‌రంలో సీవ‌రేజి వ్య‌వ‌స్థ‌పై రెండున్న‌రేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు షా క‌న్సెల్టెంట్ ద్వారా సీవ‌రేజి మాస్ట‌ర్‌ప్లాన్‌ను రూపొందించిన‌ట్లు తెలిపారు. మాస్ట‌ర్ ప్లాన్‌లో భాగంగానే మొద‌టి విడ‌త‌గా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 31 ఎస్‌టీపీల నిర్మాణానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు. 31 ఎస్‌టీపీల్లో 21 ఎస్టీపీలు చెరువుల ద‌గ్గ‌రే నిర్మిస్తామ‌ని, త‌ద్వారా చెరువులు కాలుష్యం బారిన ప‌డ‌కుండా ఉంటాయ‌న్నారు. ఎస్‌టీపీల నిర్మాణానికి ఇప్ప‌టికే భూముల‌ను సేక‌రించామ‌ని, కాబ‌ట్టి భూస‌మ‌స్య కూడా రాద‌న్నారు. 2031 వ‌ర‌కు స‌రిప‌డే విధంగా కొత్త ఎస్టీపీల‌ను నిర్మిస్తున్నామ‌ని, ఓఆర్ఆర్ ప‌రిధిలోని ప్రాంతాల మురుగు జ‌లాల‌ను కూడా ఈ ఎస్టీపీల్లో శుద్ధి చేస్తామ‌న్నారు. న‌గ‌రంలో ఇప్పుడున్న ఎస్టీపీల పూర్తిస్థాయి సామ‌ర్థ్యంలో 96 శాతం వ‌ర‌కు ప‌ని చేస్తున్నాయ‌ని, ఇది దేశంలోని అన్ని న‌గ‌రాల కంటే ఎక్కువ అని తెలిపారు. మిగ‌తా న‌గ‌రాల్లోని ఎస్టీపీలు వాటి సామ‌ర్థ్యంలో 60 – 65 శాతం వ‌ర‌కే ప‌ని చేస్తున్నాయ‌ని అన్నారు. ఎస్టీపీలు శాస్త్రీయ ప్ర‌మాణాల‌తో, స‌మ‌ర్థంగా ప‌ని చేసేలా ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఆన్‌లైన్ మానిట‌రింగ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేశామ‌ని, ఇప్పుడు కొత్త ఎస్టీపీల్లోనూ ఈ టెక్నాల‌జీని పెడ‌తామ‌న్నారు.

గ‌తంలోనే ఓఆర్ఆర్ లోప‌ల గ్రామ పంచాయ‌తీలు, మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల ప‌రిధిలోకి వ‌చ్చే ఇళ్ల‌కు నీటిని అందిస్తున్నామ‌ని, ఇప్పుడు కొత్త‌గా నిర్మించిన ఇళ్లు, కాల‌నీల‌కు నీటి స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఓఆర్ఆర్ ప‌రిధిలో కొత్త‌గా రెండు ల‌క్ష‌ల న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇస్తామ‌ని, బీపీఎల్ కుటుంబాల‌కు రూపాయికే న‌ల్లా క‌నెక్ష‌న్ ఇస్తామ‌ని తెలిపారు. న‌గ‌రంలో ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ తాగునీటి స‌మ‌స్య లేకుండా ప్ర‌భుత్వం సుంకిశాల‌ ప్రాజెక్టు చేప‌ట్టింద‌న్నారు. న‌గ‌రానికి నీరు రావ‌డంలో స‌మ‌స్య‌లు, అంత‌రాయం క‌లిగినా న‌గ‌రంలో మాత్రం నీటి స‌ర‌ఫ‌రాకు ఇబ్బంది లేకుండా రింగ్ మెయిన్ ప్రాజెక్టు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జ‌ల‌మండ‌లి ఎగ్జిక్యూటీవ్ డైరెక్ట‌ర్ ఎం.స‌త్య‌నారాయ‌ణ‌, ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్ బాబు, ఫైనాన్స్ డైరెక్ట‌ర్ వాసుదేవ నాయుడు, రెవెన్యూ డైరెక్ట‌ర్ వీఎల్ ప్ర‌వీణ్ కుమార్‌, ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్లు అజ్మీరా కృష్ణ‌, స్వామి, సీజీఎంలు, జీఎంలు, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.