రూ.25లక్షల లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన రైల్వే మేనేజర్
విశాఖ (CLiC2NEWS): వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ (DRM) సౌరభ్ ప్రసాద్.. రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా సిబిఐ అరెస్టు చేసింది. ఈ మేరకు ప్రకటనలో వెల్లడించారు. తూర్పు కోస్తా రైల్వే పనులు అప్పగించిన ఓ గుత్తేదారు సంస్థ .. పనులు చేయడంలో జాప్పం కావడంతో ఆ సంస్థకు రైల్వే భారీ జరిమానాను విధించింది. జరిమానా లేకుండా చేసేందుకు డిఆర్ ఎం లంచం డిమాండ్ చేశారు. సంస్థ ప్రతినిధులు ఆయనను కలవగా.. జరిమానా తగ్గించేందుకు రూ. 25 లక్షలు ఇవ్వాలని అన్నారు. వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. జరిమానాతో పాటు , ఆ సంస్థలకు రూ.3.17 కోట్ల మేర ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపులను తగ్గించేశారు. ఈ క్రమంలో డిఆర్ ఎంకు రూ.25 లక్షలు ఇస్తుండగా సిబిఐ వల పన్ని పట్టుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆయనతో పాటు ముంబయికి చెందిన సంస్థ ప్రతినిధి , పుణెకు చెందిన మరో ప్రైవేటు సంస్థ ప్రతినిధిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో డిఆర్ ఎం వద్ద రూ.87.6 లక్షల నగదుతో పాటు రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, ఇతర ఆస్తి పత్రాలు, బ్యాంకు లాకర్ తాళాలు , బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.