సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంపు

హైదరాబాద్ (CLiC2NEWS): సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి కార్మకులకు సంబంధించిన సమస్యలు, ఇతరాత్రా అంశాలు, వాటి పరిష్కారాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి ప్రాంతానికి చెందిన మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయస్సును 61 పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో సంస్థలో మొత్తంగా 43,899 మంది ఉద్యోగులు, అధికారులు, కార్మికులకు లబ్ధి చేకురనుంది. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీ శ్రీధర్ ను సీఎం ఆదేశించారు. రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలో ఆదేశౄలు వెలువడనున్నాయి.
దేశంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా దూసుకుపోతున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలంగాణ రాకముందు రూ.12,000 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ సంవత్సరం దాదాపు రూ.27,000 కోట్లకు చేరుకోనున్నదన్నారు.