రాజకీయ జలకాలా`టలా`

విడిపోయి కలిసుందామనుకున్నది నిజమే
మబ్బులు విడిపోయినట్లుగా విభజన చట్టం నీడన
వేరుబడ్డాం, ఒకరం ఇద్దరయ్యాం
ఉద్యోగుల పంపకాల్లో కీచులాటలు కొన్ని
నాకెంత, నీకెంత అంటూ జరిగిపోయాయి ‘నీటి ’సంతకాలు
అంతా సజావుగా ఉందని అలాయి,బలాయిలు
కలిసిన చేతులు, బిర్యానీ భోజనాలు, తీపి మంతనాలు
ఎటుపోయాయి నేడు, ఎందుకో ఈ లడాయి,
సోదర రాష్ట్రాల మధ్య జల వివాద చిచ్చు
రాజకీయ అవసరాలకా, జనంలో అలజడికా
ప్రతిపక్షాలకు పరీక్షగా ఇరువురి ఎత్తుగడ కాదుగా?
నేతల జలాకాలా’టల’ నాటకం కాదుకదా
దాదాగిరి ఎవరిది, రెచ్చగొడుతున్న వారెవరూ
సవాళ్లు ప్రతిసవాళ్ల పర్యవసనాలెటు
సై అంటే సై అనే రాజకీయ ప్రకటనలు
కృష్ణవేణీ పరుగుల నురగలు, గోదావరి పరవళ్లు
జూలైలో ఏటా ఇలా నిండవు జలాశయాలు
భవిష్యత్తులో తప్పవేమో నీటి యుద్ధాలు
దాహార్తిని తీర్చడమే కాదు, సాగుకు ఆధారం నీరు
హైడల్ పవర్ అతి తక్కువ వ్యయం మరి…
ఏ ప్రాజెక్టు ఎందుకోసమో, ఎవరి అవసరాలేమిటో
సుప్రీం అన్నది అందుకే కూర్చొని మాట్లాడు కొమ్మని
పిల్లుల రెంటి తగువు, కోతి తీర్చినట్లు
కేంద్ర జోక్యం ఖరీదు రెండు శతాల కోట్లు
చట్టాలెన్ని ఉన్నా, కొత్త గెజిట్లు వచ్చినా
ఉపఎన్నికకు ఆరంభమా ఉత్తితి సమరమేనా
రాజకీయం వెల్లడి కావాలని
ఆరాట పడుతున్నది మనస్సు.
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు