భద్రాద్రిలో వైభవంగా రాములోరి కల్యాణం

భధ్రాచలం (CLiC2NEWS): భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. మిథిలా మండపమంతా `జై శ్రీరామ్` నినాదాలతో మారుమోగింది. భక్తుల జయజయద్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో అర్చకులు కన్నుల పండువగా సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర సర్కార్ తపరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రులు, ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు అందజేశారు.
మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో జరిగిన రాములోరి కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు భద్రాద్రి వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. కరోనా మూలంగా రెండేళ్ల తర్వాత ఈ సంవత్సరం భక్తుల కు అవకాశం ఇవ్వడంతో భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 2 లక్షల ప్యాకెట్ల స్వామివారి తలంబ్రాలను అధికారులు సిద్దం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.