మహిళా కానిస్టేబుల్‌కు పోలీస్ స్టేషన్‌లో సీమంతం
గురజాల మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం

గురజాల (CLiC2NEWS): పోలీస్ స్టేషన్‌లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్‌కు అనుహ్య గౌరవం దక్కింది. గుంటూరు జిల్లా గురజాల పీఎస్‌లో సీఐ సురేంద్రబాబు, తోటి పోలీసులు దగ్గరుండి మహిళా కానిస్టేబుల్ సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్తే.. గురజాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్ గా బంగారమ్మ అనే మహిళ మూడు సంవత్సరాలుగా పనిచేస్తోంది. తోట బంగారమ్మ విధి నిర్వహణలో సమర్థురాలుగా సహచర సిబ్బంది వద్ద మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలో తొలిసారి గర్భవతిగా ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను సన్మానించాలని సిబ్బంది భావించారు. గురజాల పట్టణ సి ఐ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఘనంగా సీమంతం వేడుకలు నిర్వహించారు.
ఈ సీమంతం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల డిఎస్పి మెహర్ జయరాం ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కానిస్టేబుల్‌ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ బంగారమ్మ మాట్లాడుతూ.. తనకు ఇంతటి గౌరవం దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ఇంత ఘనంగా సీమంతం నిర్వహించిన అందరికి రుణపడి ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్. ఐ. నాగార్జున, ఎఎస్. ఐ స్టాలిన్, ఇతర గురజాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.