తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పలు రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు బంద్

అమరావతి (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం రాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. దీంతో ఆదివారం, సోమవారం కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పల్నాడు, ఎన్‌టిఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ .. కృష్ణా, బాపట్ల, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు,వాగులు పొంగి, వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. వరద నీరు రహదారులపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పలు చోట్ల రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ సమీపంలోని ఆయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగి.. విజయవాడ-కాజిపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇంటికన్నె – కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ వరద నీటికి ధ్వంసమైంది. విజయవాడ-కాజిపేట మార్గంలో ట్రాక్‌పైకి వరద నీరు చేరడంతో 24 రైళ్లను నిలిపివేశారు.