ఢిల్లీ నూతన సిఎంగా రేఖా గుప్తా..
ఢిల్లీ (CLiC2NEWS): నూతన సిఎంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రేపు ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీకి నాలుగవ మహిళా సిఎంగా ఆమె సేవలందించనున్నారు. గతంలో సుష్మాస్వరాజ్ , షీలా దీక్షిత్, ఆతిశీ సిఎంలుగా పరిచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి మెజారిటి సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. సిఎం పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. సిఎం బరిలో పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. బిజెపి అధిష్టానం రేఖా గుప్తాని ఎంపిక చేసింది.
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తా ఢిల్లీ సిఎం బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆమె షాలిమార్ బాగ్ నుండి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎబివిపి నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. బిజెపిలో పలు విభాగాల్లో క్రియాశీలంగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటి విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా గతంలో సేవలందించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా పార్టి అధిష్టానానికి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన సభాపక్ష నేతగా ఎంపికైన రేఖా గుప్తాకు బిజెపి నేతలతో పాటు ఇతర పార్టిల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి సిఎం బాధ్యతల్ని అప్పగించినందుకు పార్టి అధిష్టానానికి రేఖాగుప్తా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పనిచేస్తానన్నారు.