ధరణి సమస్యలు ఈ నెల 28లోగా పరిష్కరించండి
జిల్లా కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్
హైదరాబాద్ (CLiC2NEWS):ఈ నెల 28వ తేదీ లోగా ధరణి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. వీటితోపాటు కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోనివారి కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంబంధిత అంశాలపై దృష్టి సారించాలని సిఎస్ చెప్పారు.
ధరణిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు వెంటనే జరుగుతున్నప్పటికీ, సాంకేతికంగా పలు సమస్యలున్నాయన్నారు. నిషేధిత భూముల దరఖాస్తులు, గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్‌లో వచ్చిన దరఖాస్తులు, కోర్టు కేసులకు సంబంధించిన భూ సమస్యలన్నింటిని ఈ నెల 28 లోగా ధరణిలో పరిష్కరించాలని సిఎస్ స్పష్టంచేశారు.