షాద్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. తండ్రీ, కుమార్తె మృతి
షాద్‌నగర్ (CLiC2NEWS): ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రీ, కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ వర్ధమాన్ కాలేజ్‌లో బిటెక్ చదువుతున్న కుమార్తెను కాలేజ్‌కు పంపేందుకు ముచ్చేందర్ బైక్‌పై బయలు దేరారు. షాద్‌నగర్ చౌరస్తా వద్ద వీరి బైక్‌ను ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ముచ్చేందర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కుమార్తె కు తీవ్రగాయాలై లారీ టైర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. ఆమె అతి కష్టం మీద తన మొబైల్ ఫోన్‌ను అక్కడున్న ఓ వ్యక్తికి ఇచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించమని ప్రాధేయపడింది. ఆ సమయంలో కాపాడండి అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించాయి. స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందేలా చేశారు. వారు వచ్చేలోపే ఆమె కూడా మృతి చెందింది. మృత దేహాలను షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.