సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
ముగ్గురి మృతి, నలుగురు పరిస్థితి విషమం

సూర్యాపేట (CLiC2NEWS): హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రాహదారిపై సూర్యాపేట హైటెక్ బస్‌స్టాండ్ సమీపంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుండి ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. సూర్యాపేటకు చెందిన పుట్టా సరిత ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. రుణావత్ రుక్కమ్మ, రెండేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.