దళితబంధుకు వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేలకోట్లు : సిఎం కెసిఆర్‌

హైదరాబాద్ (CLiC2NEWS): దళితబంధు హుజూరాబాద్‌ కోసం తెచ్చింది కాదన్నారు. 1986లోనే దళితబంధు పురుడుపోసుకున్నదని ముఖ్య‌మంత్రి కెసిఆర్ స్ప‌ష్టం చేశారు. అలాగే వచ్చే బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.20వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. దళితబంధు పథకంపై జరిగిన చర్చపై సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ద‌ళితుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌న్నారు.
75 ఏళ్ల‌ సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా ద‌ళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేద‌ని పేర్కొన్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నామని, దళితబంధు పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉందన్నారు. కరోనా వల్ల పథకం ఏడాది ఆలస్యమైందని చెప్పారు. కరోనా వల్ల రూ.లక్ష కోట్లు నష్టం జరిగిందని, పరిస్థితుల మేరకు బడ్జెట్‌ అంచనాలు సవరించి నిధులు కేటాయించి ఆనవాయితీ అనీ, క్రమంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలనే ఆలోచన మాకు ఉందని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గానికి వంద మందికి ఇవ్వాలని అనుకున్నామని, దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉందని పేర్కొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ను ఇందిరాగాంధీ కాలంలో ఏర్పాటు చేశారని, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సాయం పొంది బాగుపడిన వారు కనిపించడం లేదన్నారు. నిధులతో ఫలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం పెట్టదని, మార్చిలోపు వంద నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామన్నారు. దళితబంధు నిధులు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రమంతా ఖర్చు చేస్తే రూ.1.80లక్షల కోట్లు అవసరమవుతాయని, సందేహం లేదు మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం, దళితబంధు అమలు చేస్తామన్నారు. పథకానికి రూ.3వేలకోట్లు ఖర్చు చేస్తామన్నారు.

ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు సైతం రైతుబంధు ..

హైదరాబాద్‌ మినహా ప్రతి జిల్లాలో 20 శాతం మంది ఎస్సీలు ఉన్నారని, అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 26.64శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 17.53 ఎస్సీ జనాభా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. బీసీ కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందేనన్నారు. కుల గణన కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం తీర్మానం చేసిన కేంద్రానికి పంపించామని.. ఎన్ని తీర్మానాలు పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు సైతం రైతుబంధు ఇచ్చామని, ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా దళితబంధు ఇస్తామని చెప్పారు.

రెండు, మూడు నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా ముఖ్య‌మంత్రి కెసిఆర్ కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందని వెల్లడించారు. దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూసే ఆశావహులకు కేసీఆర్‌ ప్రకటన ఊరటనిచ్చింది.

Leave A Reply

Your email address will not be published.