కాపలా కుక్కకు చికెన్ ముక్కలు వేసి.. రూ. 20 లక్షల చోరీ
గుంటూరు (CLiC2NEWS): ఓ కంపెనీలో రూ. 20 లక్షల నగదును చోరీ చేసిన దుండగులు.. తిరిగి వెళ్తున్న క్రమంలో అక్కడే ఉన్న కుక్క అరవడంతో వారి వద్ద ఉన్న చికెన్ ముక్కలు వేసి అక్కడి నుండి ఉడాయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటప్పయ్య కాలనీలో ఉన్న మిర్చి ఎగుమతుల కంపెనీ నుండి మిర్చి భారీ మొత్తంలో మలేషియా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. శనివారం గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున బైక్‌పై వచ్చి వాచ్‌మెన్‌ని తాళ్లతో కట్టేసి లోపలికి వెళ్లారు. గదిలోపల ఉన్న కబోర్డుకు ఉన్న తాళం కోసి నగదు అపహరించారు. అయితే వీరు బయటకు వెళుతున్నప్పుడు కంపెనీ వద్ద ఉన్న కుక్క అరవడంతో నిందితులు తమవెంట తెచ్చుకున్న చికెన్ ముక్కలు కుక్కకు వేసి పారిపోయారు. రూ. 20లక్షల దుండగులు అపహిరించారని కంపెనీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.