శ్రీ పద్మావతి వైద్య కళాశాల అభివృద్ధికి రూ.53.62 కోట్లు
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సుబ్బారెడ్డి
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/subbareddy-ttd.jpg)
తిరుమల (CLiC2NEWS): తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలోని స్విమ్స్ పరిధిలో గల శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో టిబి, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టళ్ల నిర్మాణ పనుల కోసం రూ.53.62 కోట్లు మంజూరు చేసినట్టు టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం వివరాలు చైర్మన్ మీడియాకు వెల్లడించారు.
టిటిడి అవసరాలకు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్ ఫెడ్ తో చర్చించేందుకు బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కమిటీ ఏర్పాటు చేశారు. అలిపిరి వద్ద గల మార్కెటింగ్ గోడౌన్ వద్ద నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్ స్టోరేజి నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేశారు. గుంటూరుకు చెందిన దాత ఆలపాటి తారాదేవి రూ.10 లక్షలతో వెండి కవచాన్ని బేడి ఆంజనేయస్వామివారికి అందించేందుకు ఆమోదం తెలిపారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఆధునీకరణ పనులకు రూ.3.12 కోట్లతో టెండరుకు ఆమోదం తెలిపారు. న్యూఢిల్లీలోని ఎస్వీ కళాశాలలో ఆడిటోరియం అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్లు మంజూరుకు బోర్డు ఆమోదం తెలిపింది.
టిటిడి విద్యాసంస్థల్లో రెగ్యులర్ బోధనా సిబ్బంది నియామకానికి, అలాగే ఇప్పటికే పని చేస్తున్న కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని కొనసాగిస్తూనే రెగ్యులర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 3 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు పనులను వెంటనే పూర్తి చేసి జూన్ 15నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఎఫ్.సి.ఆర్.ఏ (విదేశీ విరాళాల స్వీకరణ చట్టం) ప్రకారం విదేశీ భక్తుల నుండి విరాళాలు స్వీకరించడానికి టిటిడికి ఉన్న అనుమతి 2020 జనవరికి ముగిసింది. దీనిని రెన్యువల్ చేసుకోవడానికి టిటిడి దరఖాస్తు చేసినట్లు చైర్మన్ మీడియాకు వెల్లడించారు. పలు దఫాలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించామని ఆయన పేర్కొన్నరు. ఎఫ్.సి.ఆర్.ఏ, రాష్ట్ర దేవాదాయ శాఖ చట్టాల మధ్య ఉన్న సాంకేతిక కారణాల వల్ల విరాళాల డిపాజిట్లపై వచ్చే వడ్డీని చూపించడంలో కొన్ని అభ్యంతరాలు తెలిపారని .. కాగా ఇది కేవలం సాంకేతిక కారణం మాత్రమేనని తెలిపారు. కాగా ఎఫ్.సి.ఆర్.ఏ అధికారుల సూచన మేరకు త్వరగా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.3 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో టీటీడీ ఇఒఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, పోకల అశోక్ కుమార్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ తదిరులు పాల్గొన్నారు.