బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
కెసిఆర్ ఇచ్చే రూ. వెయ్యి కోట్లు ఎవరివి?: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నల్లగొండ (CLiC2NEWS): మాజీ ఐఎఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన `రాజ్యాధికార సంకల్ప సభ`లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీఎస్పీలో చేరిన ప్రవీణ్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించబడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. దళితుల బతుకులు బాగు పడాలంటే విద్య, ఉపాధి కావాలని తెలిపారు. తాను రాజీనామా చేసిన రోజే కేసుపెట్టారని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసిన జన సునామీని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. బహుజన సమాజంలో బానిసలం కామని, పాలకులమని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్ తన ఆస్తులు అమ్మి దళితబంధు అమలు చేయాలన్నారు. ఇప్పటివరకు సంపద మొత్తం 5 శాతం వర్గాల వద్దే ఉందని మండిపడ్డారు.
పేదలకు వైద్యం, విద్య, ఉపాధి, నైపుణ్యం కావాలి. గురుకుల పాఠశాలల ద్వారా కేవలం 4 లక్షల మందికే విద్య అందుతోంది. 35 లక్షల మంది విద్యార్థులను వదిలేశారు. పేదలు చదివే వర్సిటీల్లో 3-4 ఏళ్లుగా నియామకాలు లేవు. కానీ ప్రైవేటు వర్సిటీ బిల్లుకోసం పాలకులు తాపత్రాయ పడుతున్నారు అని అన్నారు. ప్రజల జీవితాలు బాగు చేసే ఉద్దేశ్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు.