పెద్ద‌పెల్లిలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు..

ఒకరు మృతి, 11 మందికి గాయాలు

పెద్దపల్లి (CLiC2NEWS): జిల్లాలోని మంథని మండ‌లం బట్టుప‌ల్లి వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మండలంలోని బ‌ట్టుప‌ల్లి, ఎక్లాస్‌పూర్‌ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న సంగ‌ఠ‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా 11 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లపల్లి నుంచి హన్మకొండ వెళ్తున్నది. ఈ క్రమంలో గాడిదుల గండి వద్ద ఓ కారును ఢీకొట్టింది. అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది.

ఈ ప్ర‌మాదంలో మంథ‌ని మండ‌లం ఖాన‌ఖ్‌సాయిపేట‌కు చెందిన కారు డ్రైవ‌ర్ వినోద్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. ఈ స‌మ‌యంలో బ‌స్సులో 13 మంది ప్ర‌యాణీకులు ఉండ‌గా వారిలో 11 మందికి గాయాల‌య్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయ‌ప‌డిన వారిలో భూపాల‌ప‌ల్లి కి చెందిన లక్ష్మి, మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రికి చెందిన సోఫియా, శ్వేత‌, మ‌నియా. అంజ‌య్య‌ను మెరుగైన చికిత్స కోసం గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో లక్ష్మి, మ‌రియా ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.