TS: వరదలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు
రాజన్న సిరిసిల్ల (CLiC2NEWS): గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాకలో 19.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వానలు ముంచెత్తుతున్నాయి. మంగళ, బుధవారాల్లోనూ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద వరద నీటిలో సోమవారం లోలెవల్ బ్రిడ్జిపై చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం కొట్టుకుపోయింది. బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. ఇవాళ ఉదయం వరకు వరద ఉధృతి ఎక్కువ అవడంతో బస్సు నీటిలో కొట్టుకుపోయింది. సిద్దిపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు దాదాపు పాతిక మంది ప్రయాణికులతో గంభీరావుపేట మీదుగా సిద్దిపేటకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.