నిర్మాణ పనుల్లో రక్షణ చర్యలు కచ్చితంగా పాటించాలి
ఓఆర్ఆర్-2 పై జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి చేపడుతున్న వివిధ నిర్మాణ పనుల్లో రక్షణ చర్యలు కచ్చితంగా తీసుకోవాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనులపై ఎండీ దానకిశోర్ సమీక్ష నిర్వహించారు. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1,200 కోట్లతో జలమండలి ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. పైప్‌లైన్ పనులు, రిజర్వాయర్ల నిర్మాణ పనులను సమీక్షించారు. డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. ఇందుకు తగ్గట్లుగా పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ సంస్థలకు సూచించారు. వర్షాకాలం దగ్గర పడుతున్నందున వీలైనంత ఎక్కువ పైప్‌లైన్ పూర్తి చేయాలని ఆదేశించారు. పైప్‌లైన్ పనులు పూర్తైన ప్రాంతాల్లో కొత్త కనెక్షన్ల మంజూరు కోసం ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త కనెక్షన్ల ఏర్పాటు కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
—