సరూర్ నగర్ అప్సర హత్య కేసు.. నిందితుడికి జీవిత ఖైదు

హైదరాబాద్ (CLiC2NEWS): సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో రంగారెడ్డి కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సరూర్ నగర్ పోలీసులు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడు వెంకట సాయికృష్ణకు జీవిత ఖైదు ..రూ.10వేల జరిమానా విధించింది. దీంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు చెల్లించాలని న్యాయస్థానం తీర్పు నిచ్చింది.
2023 జూన్‌లో పెళ్లి చేసుకోమని అడిగినందుకు అప్సరను దారుణంగా హత్య చేసి , కేసును తారుమారు చేసిన పూజారికి కోర్టు జీవితఖైదు విధించింది. పూజారి వెంకటసాయి కృష్ణ జూన్ 3వ తేదీన కోయంబత్తూరు వెళ్దామని నమ్మించి కారులో తీసుకెళ్లాడు. విమాన టికెట్లు కూడా కొనుగోలు చేసినట్లు చెప్పాడు. అతని మాటలు నమ్మిన అప్సర లగేజితో సహా బయలుదేరింది. అప్సర వ్యక్తి గత పనిమీద కోయంబత్తూరు వెళ్తోందని.. ఆమెను శంషాబాద్ విమానాశ్రయం వద్ద దింపివస్తానని, ఆమె తల్లికి వెంకటసాయి చెప్పాడు. ఆరోజు రాత్రి ఇద్దరు సరూర్‌నగర్ నుండి బయల్దేరారు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ మండలం రాల్లగూడలోని ఒక హోటల్లో భోజనం చేశారు. అక్కడ నుండి రాత్రి 11 గంటలకు సుల్తాన్ పల్లిలోని గోశాల వద్దకు వెల్లారు. అక్కడ కొంతసేపు గడిపారు. గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా కారులోకి చేర్చాడు వెంకటసాయి. తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కడలో ఓ ఖాళీ వెంచర్ వద్ద కు చేరుకోగానే అప్సర నిద్రలోకి జారుకుంది. వెంటనే సీటు కవర్‌ను ఆమె ముఖయంపై కప్పి ఊపిరాడకుండా చేశాడు. బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. అప్సర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మృతదేహం కారులోనే ఉంచి.. అక్కడి నుండి బయలు దేరి సరూర్‌నగర్ చేరుకున్నాడు. తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. రెండ్రోజుల పాటు కారులోనే అప్సర మృత దేహం కవర్లో చుట్టి ఉంది. అనంతరం సరూర్‌నగర్లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్లో పడేశాడు. దుర్వాసన వస్తోందంటూ ఎల్‌బినగర్ నుండి అడ్డా కూలీలను పిలిపించి రెండు ట్రక్కుల మట్టితో మ్యాన్‌హోల్‌ను కప్పించాడు. తర్వాత సిమెంట్‌తో పూడ్పించాడు.