మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

హైద‌రాబాద్ (CLiC2NEWS): మావోయిస్టు అగ్ర‌నేత అక్కిరాజు హ‌ర‌గోపాల్ (ఆర్కే) క‌న్నుమూశారు. ఆర్కే ప్ర‌స్తుతం మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా ఉన్నారు. ద‌క్షిణ బ‌స్త‌ర్ అడ‌వుల్లోని మాడ్ అట‌వీ ప్రాంతంలో ఆర్కె మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. పెరాల‌సిస్‌, లంగ్స్ ఇన్‌ఫెక్ష‌న్‌తో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం.

ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట‌. నాలుగు ద‌శాబ్దాలుగా మావోయిస్టు ఉద్య‌మంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఉద్య‌మ నేత‌గా మారిన స‌మ‌యంలోనే త‌న పేరును రామ‌కృష్ణ అలియాస్ ఆర్కేగా మార్చుకున్నారు. ఆ త‌ర్వాత విప్ల‌వోద్య‌మంలో అగ్ర‌నేత‌గా ఎదిగారు. ప్ర‌స్తుతం ఆయ‌న మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

దేశ‌వ్యాప్తంగా ఆర్కే పై ప‌లు కేసులు ఉన్నాయి. అలిపిరి వ‌ద్ద చంద్ర‌బాబుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. బ‌లిమెల ఎన్‌కౌంట‌ర్ నుంచి ఆర్కే తృటిలో త‌ప్పించుకోగా.. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న కు బెల్లెట్ గాయ‌మైంది. 2004 అక్టోబ‌రులో ఆనాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఆర్కే నేతృత్వంలోనే ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపారు.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన ప‌ద్మ‌జ‌ను ఆర్కే వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఆర్కేతో పాటు ఉద్య‌మంలో ప‌నిచేశారు. ఉద్య‌మం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ ఆమె టీచ‌ర్‌గా ప‌నిచేశారు. ఆమెపై కూడా ప‌లు కేసులు ఉన్నాయి. ఆర్కే తండ్రి టీచ‌ర్‌గా ప‌నిచేశారు.

Leave A Reply

Your email address will not be published.