వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: జలమండలి ఎండీ దానకిషోర్
హైదరాబాద్ (CLiC2NEWS): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ… భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తరచూ సెవరేజీ ఓవర్‌ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని అన్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మంచి నీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎక్కువ లోతు ఉన్న మ్యాన్‌హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని, జలమండలి, జీహెచ్ఎంసీ వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని, డ్రైనేజీ పనులకు సంబంధించిన వ్యర్థాలను తక్షణం తొలగించాలని , అలాగే మంచి నీటి పైపు నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా జీఎంలు జాగ్రత్త వహించాలని సూచించారు.
వర్షాల నేపథ్యంలో తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి:
వర్షాల వల్ల తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ దానకిషోర్ తెలిపారు. తాగునీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో తగిన మోతాదులో క్లోరీన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అవలంభిస్తున్నామని చెప్పారు. మొదటి విడతగా వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల(డబ్లూటీపీ) వద్ద క్లోరినేషన్ ప్రక్రియ జరుపుతున్నామన్నారు. రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల(ఎంబీఆర్) వద్ద క్లోరినేషన్ చేస్తున్నట్లు తెలిపారు. చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగర ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఐఎస్ఓ 10500 – 2012 ప్రకారం శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను జలమండలి తీసుకుంటోందన్నారు.
బస్తీల్లో క్లోరిన్ బిల్లలు పంపిణీ:
నగరంలోని బస్తీలు, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి సరఫరాపై జలమండలి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందుకుగానూ ప్రజలు ఇళ్లలో నిల్వ చేసుకున్న నీటి నాణ్యతపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు. నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసుకోవడం కోసం ప్రజలకు క్లోరిన్ బిల్లలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటివరకు జలమండలి 6.50 లక్షల క్లోరిన్ బిల్లలను పంపిణీ చేసిందని ఆయన పేర్కొన్నారు. క్లోరిన్ బిల్లలను ఉపయోగించి నీటిని ఎలా శుద్ధి చేసుకోవాలనే విషయంపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. నీటి ద్వారా ప్రబలే వ్యాధుల నివారణకు జలమండలి ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూతలను తెరవకూడదని ఆయన సూచించారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసం అయినా, తెరిచి ఉంచినట్లు తెలిస్తే జలమండలి కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఇతర వివరాలు జలమండలి కస్టమేర్ కేర్ 155313కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.