జువైనల్ హోం నుంచి ఆరుగురు బాలలు పరార్
హైదరాబాద్ (CLiC2NEWS): సైదాబాద్ జువైనల్ హోం (బాలల సంక్షేమ, సంస్కరణల వీధి బాలల సంక్షేమ సదనం-బాలుర సదనం) నుంచి ఆదివారం సాయంత్రం 6 గురు బాలురు పరారయ్యారు. ఈ పరారీలో సదనం గేట్ వద్ద కాపలాగా ఉన్న సూపర్‌వైజర్‌ను బలవంతంగా నెట్టివేసి, ఆతనిపై దాడిచేసి బీహార్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం పది మంది బాలలు పరారయ్యారు. వీరంతా ఒకక పథకం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా గేట్ వద్ద కాపలగా ఉన్న సూపర్‌వైజర్ ఖదీర్‌పై దాడిచేయటంతో కిందపడి పడిపోగానే వారందరు రోడ్ల మీద పరుగులు పెట్టారు.
ఈ క్రమంలో పారిపోతున్న వారిలో 4గురిని స్థానికుల సహాయంతో హోం సిబ్బంది పట్టుకొన్నారు. మిగతా ఆరుగురు దొరకకుండా పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ సూపర్‌వైజర్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పారిపోయిన వారి ఆచూకీ కోసం హోం సిబ్బంది సీసీ కెమెరా పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా వారం కిందట ఈ బాలలను నగరంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తుండగా అధికారులు, పోలీసులు అదుపులోకి తీసుకుని సైదాబాద్ బాలుర సదనంకు తరలించారు. కాగా ఈ మేరకు బాలుర సదనం పర్యవేక్షణాధికారి ఎన్. నాగేశ్వర్‌రావు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.