శివారు మున్సిపాలిటీల్లో సీవరేజి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
20 రోజుల్లో 6,600 పైగా ఫిర్యాదులు
ఇందులో 85 శాతానికి పైగా వెంటనే పరిష్కారం
అదనంగా 91 మంది కార్మికులు, 75 సిల్ట్ గ్రాబింగ్ వాహనాల కేటాయింపు
హైదరాబాద్ (CLiC2NEWS): జీహెచ్ఎంసీ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో సీవరేజి సమస్యల పరిష్కారానికి రానున్న మూడు నెలల పాటు ప్రత్యేక కార్యచరణ చేపట్టనున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. శివారు మున్సిపాలిటీల్లో సీవరేజి నిర్వహణ బాధ్యతలు జలమండలి చేపట్టి మూడు వారాలు గడిచిన నేపథ్యంలో సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లతో ఖైరతతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ… ఈ ప్రాంతాల్లో ఇప్పటికే సీవరేజి తరచూ ఓవర్‌ఫ్లో అయ్యే 792 హాట్‌స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ హాట్‌స్పాట్‌ల వద్ద మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చేపట్టాల్సిన పనులపై ప్రతీ హాట్‌స్పాట్‌కు వేర్వేరుగా నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. రానున్న మూడు నెలల్లో వీటిల్లో వీలైనన్ని ఎక్కువ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో సీవరేజి ఓవర్‌ఫ్లోకు కారణమవుతున్న తక్కువ సైజు సీవరేజి పైప్ లైన్లను గుర్తించాలని, ఇక్కడ సరిపడా సైజులో కొత్త పైప్‌లైన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
95 శాతం ఫిర్యాదులను పరిష్కరించాలి:
అక్టోబరు 1 నుంచి శివారు మున్సిపాలిటీల సీవరేజి బాధ్యతలను జలమండలి తీసుకుంది. ఇక్కడ మూడు వారాల్లో జలమండలి కస్టమర్ కేర్, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, వాట్సాప్, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సీవరేజి సమస్యలపై 6,684 ఫిర్యాదులు రాగా, దాదాపుగా 85 శాతం ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. వచ్చే నెల రోజుల్లో 95 శాతం ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. త్వరగా సమస్యలు పరిష్కరించడానికి అదనంగా 91 మంది కార్మికులను, 75 హైడ్రాలిక్ సిల్ట్ గ్రాబర్ వాహనాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీవరేజి సమస్యల సత్వర పరిష్కారం కోసం సరిపడా నిధులను కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ఈ ప్రాంతాల్లోని సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు వారి వారి స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్(ఆపరేషన్స్ – 2) స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.