జ‌ల‌మండ‌లిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని జ‌ల‌మండ‌లి కార్యాల‌యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించారు. ఎండి దానం కిశోర్ త్రివ‌ర్ణ‌ప‌త‌కాన్ని ఎగుర‌వేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..

తెలంగాణ ప్రజల ఎన్నో ఏళ్ల స్వరాష్ట్ర కాంక్షను ముఖ్యమంత్రి కె.చంద్ర‌శేఖ‌ర రావు సాకారం చేశాన్నారు. జలమండలి వినియోగదారులకు, ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజల్ని ఏకం చేసి.. ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారని అన్నారు. అంతేకాకుండా తెలంగాణను దేశానికే తలమానికంగా నిలపడం గొప్ప విషయం అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఒకవైపు హైదరాబాద్ నగర ప్రజలకు వందేళ్లకు సరిపడా నీటి నిల్వకు భరోసా కల్పించారని, దీనికోసం భారీ రిజర్వాయర్లను నిర్మించారని ఉద్ఘాటించారు. మరోవైపు రోజూ ఉత్పన్నమయ్యే మురుగునీటిని 100 శాతం శుద్ధి చేయడానికి ఎస్టీపీలను నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ విజన్ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మన వంతు పాత్రగా తాగునీటి సరఫరా, మురుగు శుద్ధి నిర్వహణలో సమర్థంగా పని చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, ఫైనాన్స్ డైరెక్ట‌ర్ వాసుదేవ‌నాయుడు, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, వాట‌ర్ వ‌ర్స్క్ ఎంప్లాయిస్ యూనియ‌న్ అసోసియేష‌న్, తెలంగాణ అధ్య‌క్షుడు రాంబాబు యాద‌వ్‌, అసోసియేట్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి, సీజీఎంలు, జీఎంలు, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.