Hyderabad: మ్యాన్ హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు..!

హైదరాబాద్ (CLiC2NEWS): వర్షాకాలం నేపథ్యంలో నగరంలోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్ హోళ్లు తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి అధికారులు హెచ్చరించారు. వర్షాలు కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగు సూచనలు చేశారు. వర్షాకాల ప్రణాళికలో భాగంగా.. జలమండలి ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. లోతైన మ్యాన్ హోళ్ల తో పాటు 25 వేలకు పైగా మ్యాన్ హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్ బిగించారు.ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్ తో సీల్ చేసి, రెడ్ పెయింట్ ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించారు. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది. దీని సాయంతో వర్షపు నీటిని తొలగిస్తారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పనిచేస్తారు. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి.
నగరంలో ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా లేదా ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. దగ్గర్లోని జలమండలి కార్యాలయాల్లో నేరుగా సంప్రదించవచ్చు. ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్ హోళ్లపై ఉన్న మూత తెరచినా, తొలగించినా HMWSSB ACT – 1989, సెక్షన్ 74 ప్రకారం నేరం. దీన్ని అతిక్రమించి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముంది.