రూ.కోటి విలువైన స్థలం కబ్జా కేసులో సబ్‌రిజిస్ట్రార్ ఆరెస్టు
హైదరాబాద్ (CLiC2NEWS): రూ.కోటి విలువైన 200 గజాల స్థలం కబ్జా కేసులో సబ్‌రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. స్థలం మీద కన్నేసిన వారు ఏకంగా స్థలం యజమాని మృతి చెందినట్లు నకిలీ పత్రాలు సృష్టించి , సబ్ రిజిస్ట్రార్ సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. స్థలం యజమాని ఫిర్యాదుతో కబ్జా బాగోతం బయటకొచ్చింది. ఇందులో కీలకమైన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఉప్పుగూడ హనుమాన్ నగర్‌కు చెందిన లెండ్యాల సురేశ్‌కు చెందిన 200 గజాల స్థలం కబ్జాకు గురైంది. యజమాని 1992లోనే మృతి చెందినట్లు నకిలీపత్రాలు సృష్టించారు. అతనికి నకిలి కుమారుడిని సృష్టించి.. కుమారుడు స్థలం విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. వీటన్నిటికి కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అప్పటి అధికారిణి జ్యోతి సాయంతో రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం. సబ్‌రిజిస్ట్రార్ జ్యోతిని మంగళవారం అరెస్టు చేసి మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితుల నుండి నకిలీ పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, స్కానర్ తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.