కలిసి జీవించలేని స్థితిలో తక్షణమే విడిపోవచ్చు!
విడాకులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ (CLiC2NEWS): వివాహ రద్దు పై దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది. విడాకుల మంజూరు అంశంపై సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. కలిసి బతకలేని పరిస్థితుల్లో భార్యభర్తలు విడాకుల కోసం ఆరు నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదని.. వెంటనే విడాకులు ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే దాని కోసం ఆరు నెలల పాటు ఆగాల్సిన అవసరం లేదని ఐదు గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. కొన్ని షరతులతో ఆరు నెలలు ఆగాల్సిన నిబంధనను సుప్రీం కోర్టు సడలించింది. ఈ తీర్పుతో ఫాస్ట్ ట్రాక్ విడాకులకు తెరతీసింది సర్వోన్నత న్యాయస్థానం.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(బి).. ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకులు కోరవచ్చు.. ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు లో సుదీర్ఘ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఆర్టికల్ 142ను ఉపయోగించి.. తన తాజా ఆదేశాల్లో ఆ అంశాన్ని అత్యున్నత ధర్మాసనం పక్కన పెట్టింది. ఫ్యామిలీ కోర్టులకు వెళ్లడానికి బదులు.. వెంటనే విడాకులు మంజూరు చేయొచ్చని అభిప్రాయపడింది. భార్య భర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే దాని కోసం ఆరునెలల పాటు ఆగాల్సిన అవసరం లేకుండా.. కొన్ని షరతులతో ఈ నిరీక్షణ గడువును ఎత్తి వేయొచ్చని.. జస్టిస్ ఎస్ కె. కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల దర్మాసనం సంచలన తీర్పును వెల్లడించింది.
ఫ్యామిలీ కోర్టులకు రిఫర్ చేయకుండానే సుప్రీం కోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 2016 జూన్ 29న ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదలీ చేశారు. ఈ క్రమంలో ఇష్టపూర్వంగా పరస్పర అంగీకరంతో విడాకులు కోరుకునే వారి విషయంలో సుప్రీం కోర్టు ఆర్టికల్ 142 పరిధిలో విస్తృత అధికారాలను వినియోగించుకొనే వీలుందా అనే దానిపై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. కొన్నేళ్లపాటు విచారణ జరిపిన ధర్మాసనం గత సంవంత్సరం (2022) సెప్టెంబరులో తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సోమవారం తీర్పును వెలువరించింది.