ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న.. స‌మ‌ర్ధించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఇద్ద‌రు కంటే ఎక్కువ మంది పిల్ల‌లు ఉంటే అన‌ర్హులు అనే నిబంధ‌న రాజ‌స్థాన్‌లో అమ‌లులో ఉంది. ఈ నిర్ణ‌యాన్ని తాజాగా దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స‌మ‌ర్థించింది. దీనిలో ఎలాంటి వివ‌క్ష గానీ, రాజ్యాంగ ఉల్లంఘ‌న గానీ లేద‌ని తెలిపింది. ఈ నింబంధ‌న‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ‌స్థాన్ రాష్ట్రంలో ప్ర‌బుత్వ ఉద్యోగాల‌న్నిటికి ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న అమ‌లు చేస్తూ.. రాజ‌స్థాన్ వేరియ‌స్ స‌ర్వీస్ రూల్స్ చ‌ట్టానికి 2001లో స‌వ‌ర‌ణ‌లు చేశారు.

రాజ‌స్థాన్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న కొన్ని ఏళ్ల నుండి అమ‌లులో ఉంది. సైన్యంలో ప‌నిచేసి 2017లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన రామ్‌జి లాల్ ఉద్యోగం కోసం 2018లో ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అత‌నికి ఇద్ద‌రు కంటే ఎక్కువ‌మంది సంతానం ఉండ‌టంతో ఆయ‌న ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌రించ‌బ‌డింది. దీంతో రామ్‌జి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించాడు. రాజ‌స్థాన్ హైకోర్టు ఆయ‌న పిటిష‌న్‌ను 2022లో కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాడు. తాజాగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న‌ను స‌మ‌ర్ధించింది. ఇందులో ఎలాంటి వివ‌క్ష లేద‌ని, కుటుంబ నియంత్ర‌ణ‌ను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధ‌న రాజ్యాంగ ఉల్లంఘ‌న కింద‌కు రాద‌ని తెలిపింది. గ‌తంలో కొన్ని రాష్ట్రాల్లో పంచాయితీ ఎన్నిక‌ల కోసం ఈ రూల్ తీసుకురాగా మేం దాన్ని ఆమోదించామని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.