రాణించిన విరాట్ కోహ్లీ.. పాక్ లక్ష్యం 152 పరుగులు

దుబాయ్ (CLiC2NEWS):
దాయాదుల పోరు రసవత్తరంగా సాగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ 2021 భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ ముందు 152 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
పాకిస్తాన్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్లోనే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. షాహిన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 8 బంతులు ఆడి 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. షాహిన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్ మొదటి బంతికే బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టి ఊపుమీద ఉన్నట్లు కనిపించినా 11 పరుగులకే ఔటయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి హసన్ అలీ బౌలింగ్‌లో కాటన్ బౌల్డ్ అయ్యాడు.
ఆదుకున్న సారథి
వరుసగా 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను కోహ్లీ, రిషబ్ పంత్ ముందుకు నడిపించారు. రిషబ్ పంత్ 30 బంతుల్లో 39 (2 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేశాడు. షాదబ్ ఖాన్ వేసిన 12వ ఓవర్ రెండో బంతికి షార్ట్‌కు ప్రయత్నించిన పంత్ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రవీంద్ర జాడేజా 12 బంతుల్లో 13 పరుగులు చేసి నిరాశపరిచాడు. హార్దిక్ పాండ్యా ఏడు బంతుల్లో 11 పరుగులు చేసి పెవివియన్ చేరాడు. చివర్లో భువనేశ్వర్ 5 పరుగులు చేయగా షమీకి స్ట్రైకింగ్ రాలేదు.
కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57(ఐదు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి 18వ ఓవర్ మూడో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 3, హసన్ అలీ 2, షాదబ్ ఖాన్1 వికెట్, రౌఫ్ 1 వికెట్ తీశారు.