తాలిబన్ అర్థం విద్యార్థి.. కానీ
అర శాతం లేరు అఫ్ఘాన్‌లో వారు
ఆయుధాలు చేబూని హడలెత్తిస్తున్నారు
అగ్రరాజ్యమే తోకముడించిందని
విర్రవీగుతున్నారు వీధుల్లో చేరి..
ధనిక దేశాల ఆధిపత్య పోరు
దేశ జనానికే తెచ్చింది చేటు..
ఎదురేలేని ముష్కరుల దాష్టీకాలు
విద్యార్థి పేరుతో విధ్వంసాలేమిటో..
అభ్యసించారా వారు మానవతావాదం
ఛాందసవాదం బరితెగించిందా..
బాలికలు ఇక కట్టుబానిసలే
టెక్నాలజీతో దేశదేశాలు
వీక్షిస్తున్నాయి, ప్రజల హాహాకారాలు..
భవిష్యత్తు కోసం పసికందులను
వదులుకుంటున్నారు అమ్మనాన్నలు
ముళ్ల కంచెలు దాటి విమానయానం
ఆర్ధిక భారంతో అడ్డు తొలిగింది అమెరికా
ఊచకోతలు చూస్తూ ఊరుకుంటున్నారంతా
కమ్యూనిస్టు దేశాల లక్ష్యాలు మారాయి..
సామ్యవాదం, సామాజిక న్యాయం
చోటులేదిప్పుడు… చైనా, రష్యాల్లో
శత్రువు భంగపాటుతో వికృతానందం
జనం ఘోషపట్టని కబోదులు అవి
దుర్జన మూకలకే పాక్ చేయూత
ఐరాసా ఎందుకో, విజ్ఞానం ఎవరికో
సర్వమానవ సౌభాతృత్వం…
సర్వేజనో సుఖినోభవంతు…
చెవులకింపుగా ఈ పదజాలాలు
ఆఫ్ఘన్ జన ఆక్రందనలు, ఆవేధనలు
మారణకాండకు ముగింపు రావాలనే
ఆరాటంతోనే మనస్సుకు ఈ అశాంతి
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు