Hyderabad: బుక్ చేసిన 24 గంటల్లో ట్యాంకర్ డెలివరీ..!
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో వినియోగదారులు ట్యాంకర్ బుక్ చేసుకున్న 24 గంటల్లో వాటర్ ట్యాంకర్ డెలివరీ చేయనున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. గతేడాది వర్షాలు లేకపోవడంతో హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో ఈ ఏడాది వేసవి ప్రారంభం కాకముందే ఫిబ్రవరి నెల నుంచే నీటికి డిమాండ్ ఏర్పడింది. బోర్లపై ఆధారపడే ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ కు తాగునీరు సరఫరా చేస్తున్న జలమండలిపై ఆధారపడ్డారు. జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లను భారీగా బుక్ చేసుకున్నారు. ముఖ్యమంగా పలు ప్రాంతాల్లోని 30 వేలకు పైగా ప్రజలు పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడిన పరిస్థితి ఏర్పడినదని తెలియజేశారు.
వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ లు రావడంతో జలమండలి అప్రమత్తమైంది. కానీ రోజు రోజుకీ డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో 2, 3 రోజులకు ఒకసారి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేసే స్థితి వచ్చింది. ఆలస్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి సారించారు. జలమండలి ఉన్నతాధికారులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించి 24 గంటల్లోపు ట్యాంకర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ, సిబ్బంది సమష్టి కృషి ఫలితంగా పరిస్థితి అదుపులోకి వచ్చి.. ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లోగా డెలివరీ చేసే స్థితికి జలమండలి చేరురుకుందని తెలిపారు.