ప్రముఖ దర్శకుడు కన్నుమూత
చెన్నై (CLiC2NEWS): తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత నారాయణ్ నారంగ్ మరణవార్తను మరువ ముందే మరో ప్రముఖ తెలుగు దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. ఎన్టీఆర్ సుపర్హిట్ సినిమా `యమగోల` సినిమాకు తాతినేని దర్శకత్వం వహించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ దవాఖానాలో చేర్పించారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆయన కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. తాతినేని మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. వెంటవెంటనే ఇద్దరు ప్రముఖ వ్యక్తులను కోల్పోవడం బాధాకరంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పెడుతున్నారు.
తాతినేని రామారావు కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో 1938లో జన్మించారు. తెలుగు , హిందీలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో నవరాత్రి, బ్రహ్మచారి, సుపుత్రుడు, రైతు కుటుంబం, దొరబాబు, ఆలుమగలు, శ్రీరామరక్ష, యమగోల, ఆటగాడు, అనురాగ దేవత, జీవన తరంగాలు, ఇల్లాలు, తల్లిదండ్రులు, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాలు ఆయన దర్శకత్వంలో తెరకెక్కినవే. ఎన్టీఆర్ కథాయకుడిగా నటించిన యమగోల చిత్రం తాతినేని రామారావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే చిత్రాన్ని 1979లో హిందీలోకి లోక్ పరలోక్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్‌లోను విజయం అందుకున్నారు.