దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణలో పాలన.. సిఎం కెసిఆర్
సింగపూర్ అలా.. మనమెందుకు ఇలా..
హైదరాబాద్ (CLiC2NEWS): మాదాపూర్‌లోని హెచ్ ఐసిసిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టిఆర్ ఎస్ ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈసభకు 3వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ టిఆర్ ఎస్ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం సిఎం మాట్లాడుతూ.. దేశానికే రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తాన్నామని, కేంద్రం, వివిధ సంస్థల నుండి వస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శనమని చెప్పారు. దేశంలో ఉత్తమ గ్రామాల జాబితాలో మొదటి 10 గ్రామాలు తెలంగాణవే అని కేంద్రం ప్రకటించినదని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
టిఆర్ ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు అని అన్నారు. ఎన్నో ఒడుదొడుకులు, అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
కఠిన నిర్ణయం తీసుకొని నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చామని, 85 శాతం మొక్కలు దక్కకుంటే టిఆర్ ఎస్ అయినా సర్పంచ్, గ్రామ కార్యదర్శి ఉద్యోగాలు పోతాయని చెప్పామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సహితం భాగస్వామ్యం చేశామని, అందుకే ఫలితాలు వచ్చాయన్నారు. జ్ఞానాన్ని స్వీకరించే గుణం ఉండాలి.. అన్నీ మనకే తెలుసనే అహంకారం ఉండకూడదు. అవినీతిరహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నాం కాబట్టి అనుకున్న లక్ష్యాలతో రాష్ట్రాన్నిప్రగతిపథంలో తీసుకెళ్తున్న పార్టి టిఆర్ ఎస్ అని సిఎం అన్నారు.
సింగపూర్ అలా.. మనమెందుకు ఇలా..
ఏమీ లేని సింగపూర్ అద్భుతంగా రాణిస్తోంది. మట్టి కూడా వాళ్లు పొరుగుదేశం ఇండోనేషియా నుంచి నౌకల్లో దిగుమతి చేసుకుంటారు. కూరగాయలు కూడా వాళ్ల దగ్గర పండవు. ఆ దేశంలో ఏమీ లేదు.. కానీ అక్కడ ఎందుకంత అభివృద్ధి జరిగింది? మనదగ్గర అన్నీ ఉన్నా నేతలకు వాటిని ఉపయోగించుకునే తెలివితేటలులేవు. ఇది నిప్పులాంటి నిజం.. హేతుబద్ధమైన వాదం.. కఠోరమైన వాస్తవం. రాజకీయ రణగొణ ధ్వనులు, మైకులు పగిలిపోయే ఉపన్యాసాలతో స్వతంత్య్రం తర్వాత 75 ఏళ్ల జీవితం గడిచింది తప్ప ప్రజల ఆశయాలుమాత్రం నెరవేరలేదని సిఎం అన్నారు.