తెలంగాణ రాష్ట్రమంతా ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవపు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిద్దిపేట కలెక్టరేట్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో జరిగిన వేడుకలలో మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో అవతరణ దినోత్సపు వేడుకలలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సఖేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శాసనసభ డిప్యూటి స్పీకర్ పద్మారావు జాతీయ జెండా ఎగురవేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతకాన్ని ఎగురవేశారు. వరంగల్ కోటలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్నారు.



మహబూబ్‌నగర్ జిల్లాలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో మంత్రి జగదీశ్ రెడ్డి ఆవిర్భావ వేడుకలలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
