వైద్య సేవల్లో తెలంగాణ భేష్ : మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్ (CLiC2NEWS): నిరుపేదలకు వైద్యం అందించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని మంత్రి తెలిపారు. చౌటుప్పల్ లోని సర్కారు ఆరోగ్య కేంద్రంలో ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని ఆరోగ్య మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపి లింగయ్య యాదవ్, మనుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.. సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్కేంద్రాలు ఏర్పాటు చేసి కిడ్ని వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి ఎపిలో మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవి… ఆ సంఖ్య ప్రస్తుతం 102కి పెరిగిందని మంత్రి తెలిపారు. కాగా కేంద్ర సర్కార్ వివక్ష చూపిస్తున్నదని తెలిపారు. కేంద్ర సర్కార్ దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపిందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పేమలా సత్పతి, స్థానిక పురపాలిక చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.