ఆరుగురు కేంద్ర‌మంత్రుల‌ను క‌లిసిన ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మంగ‌ళ‌వారం ఆరుగ‌రు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర‌మంత్రులు ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ శెకావ‌త్‌, జ‌ల్‌శ‌క్తి శాఖ మంత్రి సిఆర్‌పాటిల్, నిర్మలాసీతారామ‌న్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, వ్య‌వ‌సాయ , గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ , పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్‌రంజ‌న్ సింగ్‌ల‌ను క‌లిశారు. ఆయా శాఖ‌ల్లో పెండింగ్ స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం ఉప‌రాష్ట్రప‌తిని క‌లిశారు.

కేంద్ర‌మంత్రి నిర్మలా సీతార‌మాన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… ఎపి గ్రామీణ ర‌హ‌దారుల అభివృద్ధికి ఏషియ‌న్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐఐబి) నుండి తీసుకునే రుణంలో వెసులుబాటు క‌ల్పించాల‌ని ప‌వ‌న్‌కల్యాణ్ విజ్ఞ‌ప్తి చేశారు. ఎఐఐబి ఇంత‌కు ముందు ఒప్పుకున్న ప్ర‌కారం రూ.3834.52కోట్లు మంజూరు చేసేలా చూడాల‌ని కోరారు. గ్రామీణ రాహ‌దారి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇచ్చిన గ‌డువును 2026 డిసెంబ‌ర్ వ‌ర‌కు పొడిగించాల‌ని కోరారు.

కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ శెకావ‌త్‌తో స‌మావేశ‌మైన డిసిఎం.. కేంద్ర ప‌ర్యాట‌క శాఖ స్పెష‌ల్ అసిస్ట‌న్స్ టూ స్టేట్ క్యాపిట‌ల్ ఇన్వెస్టిమెంట్ (సాస్కి) ప్యాకేజి కింద రాష్ట్రం ప్ర‌తిపాదించిన గండికోట‌, అఖండ గోదావి, సూర్య‌లంక బీచ్‌ల‌కు రూ.250 కోట్లు విడుద‌ల‌చేయాల‌ని కోరారు. అదేవిధంగా రాజ‌ధానిఅమ‌రావ‌తిలో నిర్మించ త‌ల‌పెట్టిన అత్యాధునిక ప‌ర్యాట‌క భ‌వ‌న్‌కు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ ఎంఒటిగా రూ.80కోట్లు విడుద‌ల చేయాల‌ని .. అర‌కు, లంబ‌సింగిల్లో ఎకో టూరిజం, ఎడ్వెంచ‌ర్ కేట‌గిరీ ప‌ర్యాట‌క ప్రాజెక్టులు అభివృద్ధి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. గోదావరి బ్యాక్ వాట‌ర్‌ను ఉప‌యోగించుకొని హౌస్‌బోట్లు, న‌ది తీరంలో చ‌క్క‌టి వ‌స‌తి ఏర్పాట్ల‌తో కోన‌సీమ అభివృద్ధి.. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలాన్ని ఆధ్యాత్మిక‌, సాస్కృతిక ప‌ర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల‌ని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్ర‌సాద్ ప‌థ‌కంలో అర‌స‌వ‌ల్లి, మంగ‌ళ‌గిరి, ఆల‌యాల‌ను చేర్చాల‌న్నారు. అంతేకాకుండా ప‌ర్యాట‌క రంగంలో విద్యార్థుల‌కు నైపుణ్యాల‌ను అందించేలా జాతీయ ప‌ర్యాటక విశ్వ‌విద్యాల‌యాన్ని ఎపిఓల నెల‌కొల్పాల‌న్నారు. చివ‌ర‌గా ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెంట జ‌న‌సేన ఎంపిలు వల్ల‌భ‌నేని బాల‌శౌరి, తంగెళ్ల ఉద‌య్‌శ్రీ‌నివాస్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.