ఏకంగా బ్యాంక్ మేనేజర్ నుండే రూ.9 లక్షలు కొట్టేసిన సైబర్ మోసగాడు
అనంతపురం (CLiC2NEWS): సైబర్ నేరగాళ్లకు రోజూ ఎవరో ఒకరు బలౌతూనేఉన్నారు. సామాన్య ప్రజలే కాకుండా ఉద్యోగులు సైతం వీరి బారిన పడుతున్నారు. తాజాగా బ్యాంక్ మేనేజర్ నుండే రూ. 9 లక్షలు పైగా కొట్టేశారు. నగరంలోని రాంగనగర్‌లో ఉన్న స్టేట్‌బ్యాంకు చీఫ్ మేనేజర్ వద్ద నుండి రూ.9.50లక్షలు వారి ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. మోసపోయామని తెలుసుకున్న మేనేజర్ పోలీసులను ఆశ్రయించారు.
అనంతపురం లో ఉన్న ధన్వి మోటార్స్ షోరూంకు ఓ వ్యక్తి ఫోన్ చేసి, తాను జొమాటొ సంస్థ నుండి మాట్లాడుతున్నాని తెలిపాడు. తమ సంస్థకు 10 హోండా యాక్టివా ద్విచక్ర వాహనాలు కావాలని కోరాడు. వాహనాల ధరలకు సంబంధించిన కంపెనీ పేరు మీద కొటేషన్ లెటర్, ఒక క్యాన్సిల్డ్ చెక్ ఫొటొలను తనకు మెయిల్ ద్వారా పంపాలని కోరాడు. సాంకేతికత ఆధారంగా సైబర్ నేరగాడు ఆ లెటర్‌ను , చెక్‌ను మార్చేశాడు. కొటేషన్ లెటర్‌లో తన బ్యాంకు ఖాతాను పొందుపరిచాడు. చెక్కుపై ఉన్న క్యాన్సిల్డ్ అనే పదాన్ని చెరిపేశాడు. అందులో రాసి ఉన్న నగదు మొత్తాన్ని రూ. 9,50,000గా మార్చాడు. దీనిని ఎస్‌బిఐ బ్యాంకు మేనేజర్‌కు పంపి .. తాను ధన్వి మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గా పరిచయం చేసుకున్నాడు. తన తల్లి ఆస్పత్రిలో ఉందని, డబ్బు అవసరమై మీకు వాట్సాప్‌లో లెటర్, చెక్కు పంపుతున్నాను. మాకంపెనీ ఖాతానుండి రూ. 9,50లక్షలు పంపించమని కోరాడు. ఆస్పత్రి నుండి వచ్చాక అసలైన చెక్కు అందజేస్తానని నమ్మించాడు. అతని మాటలు నిజమని నమ్మిన మేనేజర్ అతని ఖాతాకు నగదు జమ చేశాడు. ఈ సమాచారం వెంటనే ధన్వి మోటార్స్ షోరూం నిర్వాహకులకు వెళ్లడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. తాము ఎలాంటి నగదు కోరలేదని తెలిపారు. సదరు నేరగాడు నంబర్‌కు ఫోన్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. నంబర్‌సైతం బ్లాక్ చేశాడు.