చేయూత నగదు జమ అని నమ్మించి..
యువతి ఖాతా నుండి రూ. 82వేలు మాయం
ఏలూరు (CLiC2NEWS): వైఎస్ ఆర్ చేయూత నగదు ఖాతాలో జమ చేస్తామని నమ్మంచి .. ఓ యువతి ఖాతా నుండి రూ. 82వేలు కాజేశారు. ఈ ఉందంతం జిల్లాలోని కుక్కునూరు మండలం ఉప్పేరులో చోటుచేసుకుంది. పల్లం సంధ్యారాణి బ్యాంకు ఖాతా నుండి సైబర్ మోసగాళ్లు రూ. 82,697 కాజేశారు.
వాలంటీర్ ఎం. వెంకటేశ్ నరేంద్రబాబుకు ఫోన్ చేశాడు. వైఎస్ ఆర్ చేయూత రూ. 18,500 మీ ఖాతాలో పడుతుందని చెప్పాడు. గ్రామ అధికారి కాన్ఫరెన్స్‌కాల్‌లో ఉన్నారని, మీ ఫోన్ పే నెంబర్ చెబితే నగదు జమచేస్తారన్నారు. నరేంద్రకు ఫోన్‌పే లేకపోవడంతో తన సోదరి సంధ్యారాణి నంబరు చెప్పాడు. దీంతో ఫోన్‌లైన్‌లో ఉన్న అవతలి వ్యక్తి మీఖాతాలో రూ. 18,500 జమైనట్లు వస్తుంది చూడండి అన్నాడు. రాలేదని ఆమె చెప్పారు. ఈ ప్రక్రియ ఒక నిమిషంలో పూర్తికావాలని, లేకుంటే జమ కాదని చెప్పి ఒటిపి చెప్పమన్నారు. తర్వాత రూ. 18,499 సక్సెస్ అంటూ కనిపించింది.
అదే విధంగా మరో రెండు సార్లు రూ. 18,400, రూ. 18,399, రూ. 18,399, ఐదోసారి రూ. 9000 సక్సెస్ అని వచ్చింది. అంటే మొత్తం రూ. 82,697 జమ కాకపోగా, తన ఖాతా నుండి పోయినట్లు బాధితురాలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ వెంకటేశ్‌ను ఆరా తీయగా.. ఉన్నతాధికారినంటూ తనకు ఫోన్ వచ్చిందని.. ఎవరని అడిగితే , ఉన్నతాధికారులతో ఇలాగేనా మాట్లాడేదని.. అంటూ చేయూత నగదు ఎవరెవరికి పడలేదో లబ్ధిదారులకు ఫోన్ చేయాలన్నారు. దాంతో తాను నరేంద్ర అనే వ్యక్తికి ఫోన్ చేశానని చెప్పారు. పోలీసులు బాధితురాలిని, వాలంటీర్‌ను విచారిస్తున్నారు.